గండిపేట, వెలుగు: తెలంగాణ పోలీస్ అకాడమీలో సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను మంగళవారం రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 65 మంది పిల్లలు పాల్గొంటున్న ఈ క్యాంప్‌లో ఈత, యోగా, పెయింటింగ్, చెస్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి వేసవి సెలవులు, జ్ఞాపకాలను డీజీపీ గుర్తుచేసుకున్నారు.
సొంత ఊరిలో, అమ్మమ్మల ఇంట్లో గడిపిన రోజులు, ఊర్లోని బావుల్లో ఈత కొట్టడం, మామిడి తోటల్లో తిరగడం వంటి అనుభవాలే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని చెప్పారు. సెలవుల్లో పిల్లలు శారీరకంగా, మానసికగా ఎదిగేందుకు సమ్మర్ క్యాంపులు ఎంతో అవసరమన్నారు. ఇందులో పిల్లలకు తెలుగు భాష, పద్యాలపై ఆసక్తి పెంచేలా తరగతులు నిర్వహించాలని సూచించారు.ఇదే వేదికపై త్వరలో రిటైర్ కానున్న డీజీపీ శివధర్ రెడ్డిని, ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిస్త్, మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

